WTF: ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌కు తెలుగుపండుగొచ్చింది… జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్ ఐ సిసి నోవాటెల్ లో జరిగే ప్రపంచ తెలుగు సమాఖ్య(WTF) 12వ ద్వైవార్షిక మహాసభలకు వేదిక సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ మహాసభలకోసం హైదరాబాద్ అంతటా ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు సంసిద్ధత వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ వేడుకలకు వస్తున్నారు. సినిమా కళాకారులు, సాహితీవేత్తలు, వివిధ రంగాల్లో పేరుగాంచిన మహిళామణులు కూడా ఈ మహాసభలకు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బిజినెస్ సదస్సులు, మహిళా సదస్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ మహాసభల్లో కనువిందు చేయనున్నాయి. రామ్ మిర్యాలతో సంగీత విభావరి ఉర్రూతలూగించనున్నది. అలాగే తెలుగుదనం కనిపించేలా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు సినిమారంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, మురళీ మోహన్ తదితరులు వస్తుండటంతో అభిమానులకు కూడా పండగేనని చెప్పవచ్చు. ఈ మహాసభలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు హైదరాబాద్ ముస్తాబైంది. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఈ వేడుకల్లో పాల్గొన నున్నారు.
జనవరి 3వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. జనవరి 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ తెలిపారు. ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించను న్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీ కళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటా యని నిర్వాహకులు పేర్కొన్నారు. యునికార్న్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కవిత దత్ మాట్లాడుతూ ఈ మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 10 మందికి బిజినెస్ యాచీవర్ అవార్డులు ఇస్తున్నామని, అదే విధంగా తమ తమ కంపెనీల ద్వారా సేవ – దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ) అవార్డ్స్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో 3 రోజులపాటు జరిగే కార్యక్రమాల వివరాలను కూడా ఆమె తెలియజేశారు.
మహాసభలకు వస్తున్న ప్రముఖులు
ప్రపంచ తెలుగు సమాఖ్య హైదరాబాద్‌లో నిర్వహించే మహాసభలకు పలువురు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వస్తున్నారు. వీరితో పాటు ఇతర మంత్రులు కూడా హజరవుతున్నట్లు తెలిసింది.
సినీరంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధతోపాటు రామ్ మిర్యాల తదితరులు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్ తదితరులు కూడా ఈ వేడుకలకు తరలివస్తున్నట్లు సమాచారం.
వ్యాపారరంగం నుంచి జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు, రెడ్డి ల్యాబ్స్ అధినేత జి.వి ప్రసాద్, భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, ర్యాపిడో ఫౌండర్ రిషికేష్ ఎస్‌ఆర్, ఎండియా పార్టనర్స్ మేనెజింగ్ డైరెక్టర్ సతీష్ ఆంధ్ర, డ్రావిన్‌బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ పవన్ కుమార్ చందన, దివీస్ ల్యాబ్స్ ప్రముఖులు డాక్టర్ మురళీ కె. దివి, సియాంట్ అధినేత బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు, అమరరాజా బ్యాటరీస్ అధినేత రామచంద్ర ఎన్. గల్లా వస్తున్నవారిలో ఉన్నారు.
వివిధ కార్యక్రమాలు
జనవరి 3వ తేదీన ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్‌లో భాగంగా సెమినార్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. 5.45కి తెలుగు ఏంజెల్స్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు బిజినెస్ సెమినార్ 2 జరుగుతుంది. రాత్రి 7.30కు సంగీత విభావరి, 8.30కి నెట్ వర్కింగ్, డిన్నర్ కార్యక్రమం ఉంటుంది.
జనవరి 4వ తేదీన కల్చరల్, లిటరరీ కార్యక్రమాలు జరుగుతుంది. ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 11.30కి అవార్డుల వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2.30కు డెలిగేట్స్ సెషన్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఫ్యాషన్ షో జరుగుతుంది. చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. సా. 5.15 గంటలకు తెలుగు ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది. సా. 6.30కు మలేషియా తెలుగు విద్యార్థుల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7.15కు రామ్ మిర్యాల సంగీత విభావరి జరుగుతుంది. రాత్రి 8 గంటలకు డిన్నర్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి.
5వ తేదీ కార్యక్రమాల వివరాలు
ఉదయం 10 గంటలకు కల్చరల్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగు క్రియేటర్స్, ఇంపాక్ట్ కార్యక్రమం ఉంటుంది. 3.10కి కల్చరల్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిధిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. సా. 6 గంటలకు సినీ ప్రముఖుల సత్కారం, రాత్రి 7 గంటలకు ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
ఆహ్వానం
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాము. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్ ఐ సిసి నోవాటెల్‌లో జరిగే ఈ మహాసభలు తెలుగుదనం వెల్లివిరిసేలా సాగనున్నది. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది తెలుగు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీవేత్తలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను అభిమానించే వారంద3 నుంచి 5 జనవరి 2025 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వైభవంగా జరగనున్న తెలుగు సభలకు ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున ఇదే మా ఆహ్వానం అని అన్నారు. 1992లో ప్రారంభించబడిన ప్రపంచ తెలుగు సమాఖ్య ఈ 30 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇప్పటి వరకు 11 తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూర్, సింగపూర్, దుబాయ్, మలేషియాలో నిర్వహించిన అన్ని సభలు విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభలు కూడా తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినిమా, సాహిత్య, వాణిజ్యరంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకలకు తరలివస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఎంతోమంది తెలుగు ప్రముఖులు వస్తున్నారు. మీరంతా వచ్చి కార్యక్రమాలను తిలకించి కళాకారులను, నిర్వాహకులను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.
ఇందిరాదత్
ప్రెసిడెంట్, డబ్ల్యుటీఎఫ్
అవార్డులు… కార్యక్రమాలు
హైదరాబాద్‌లో నిర్వహించే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. తెలుగుదనం ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఈసారి కొత్తగా తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో తెలుగు స్టార్ట్ అప్ కంపెనీలను పరిచయం చేస్తున్నాము. అలాగే ప్రముఖులను గౌరవించడం, వారిని అవార్డులతో సత్కరించడం వంటివి చేస్తున్నాము. అందరినీ ఆకట్టుకునేలా సంగీత విభావరి, ఫ్యాషన్ షో లాంటి కార్యక్రమాలు కూడాఉన్నాయి. అలాగే నిష్ణాతులైన 10 మందికి బిజినెస్ యాచీవర్ అవార్డులు ఇవ్వనున్నాము. తమ కంపెనీల ద్వారా సేవ – దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ) అవార్డ్స్ ఇస్తున్నాము. బిజినెస్ సెమినార్ లు తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, తెలుగు పద్య సౌరభాలు, హాస్య వల్లరి ప్రోగ్రాం లు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, తెలుగు జానపద విన్యాసాలు మున్నగు అనేక కార్యక్రమాలతో కూడిన ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతంచేయాలని కోరుకుంటున్నాను.
కవితాదత్
వైస్ ప్రెసిడెంట్