Revanth Reddy: నర్సంపేట బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుంది. గత పదేళ్లలో బీఆరెస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి. కానీ ఈనాడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం..
తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలంటే వాళ్ల ఆస్తులు రాసిచ్చినట్లు మాట్లాడారు. కానీ ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది బిడ్డలకు సన్నబియ్యం అందిస్తున్నాం. ఏడాదికి రూ. 13 వేల కోట్లు భారమైనా.. పేదవాడి ఆకలి తీర్చాలని సన్నబియ్యం అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నదే మా ప్రయత్నం.
2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రూ. 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నాం. దేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలను ఏర్పాటు చేసిన ఘనత జవహర్ లాల్ నెహ్రూ. దేశంలో సాగునీటి ప్రాజెక్టులను అందించిన ఘనత జవహర్ లాల్ నెహ్రూ. కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ అని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.
హైదరాబాద్ నగరంలా వరంగల్ ను తీర్చి దిద్దుతాం. హైదరాబాద్ లా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం. మార్చి 31 లోగా వరంగల్ ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందుకే అన్ని రంగాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు చేపట్టాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు మహిళలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం.
మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తాం. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు చీర చేరాల్సిందే. ఏ ఆడబిడ్డ తనకు చీర రాలేదు అనే మాట రావద్దు. అందరికీ చీరలు చేరేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. చదువుకున్న వాడే గుణవంతుడు.. ధనవంతుడు.. చదువొక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. అందుకే మీ పిల్లలను చదివించండి.. మీ పిల్లల చదువుకు కావాల్సిన వసతులు అందించే బాధ్యత నాది.
మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. నిరుద్యోగ యువత బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయకండి… ప్రజల మనసులు గెలుచుకోండి. గ్రామ సమస్యలపై అవగాహన పెంచుకోండి.. అభివృద్ధి చేసుకోండి. జూబ్లీహిల్స్ లో బీఆరెస్ ను ప్రజలు బండకేసి కొట్టినా వాళ్లకు బుద్ది రాలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. గ్రామాల్లో రాజకీయ కక్షలకు తావు ఇవ్వొద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేసుకునే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. మంచి వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతాం. కేంద్రంతో కోట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తాం.






