Pawan Kalyan: తెలంగాణాలో పవన్ ను పక్కన పెడతారా…?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ (NDA) ఇప్పుడు తెలంగాణ పై గట్టిగానే దృష్టిపెడుతోంది. తెలంగాణలో ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజాక్కించుకోవాలని బిజెపి పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేయాలని… అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ నుంచి ఉండాలని ప్లాన్ చేస్తున్నారు బిజెపి (BJP) అగ్ర నేతలు. ఇక దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇప్పటికే పరోక్షంగా అంగీకారం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు కూటమి నేతలు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు అధ్యక్ష పదవులను భర్తీ చేసి అలాగే జిల్లా పార్టీ పదవుల విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే బీజేపీ నుంచి సంకేతాలు వెళ్ళాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబునాయుడు ప్రణాళిక సిద్ధం చేశారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే తెలంగాణలో టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఈ విషయంలో ఇప్పటికే పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ అటు బిజెపితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే జనసేన పార్టీని తెలంగాణలో పక్కన పెట్టే ఆలోచనలో కూడా బిజెపి పెద్దలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో పెద్దగా క్యాడర్ లేకపోవడం కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ప్రభావం కూడా తెలంగాణలో తక్కువగా ఉండటంతో ఈ విషయంలో కాస్త బీజేపీ పెద్దలు పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో భారీగానే ఉండటంతో ఆది కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బిజెపి పెద్దల్లో ఉంది. దీంతో ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం, బిజెపి మాత్రమే కలిసి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.