Raja Singh: ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్న పార్టీ అగ్రనాయకత్వం నుండి ఆదేశాలు రావాల్సి ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని పార్టీ ఇచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహారమేనని తెలిపారు. వారిలాగే చాలా మంది పదవులు పోతాయని పార్టీలో జరుగుతున్న ఇబ్బందులపై నోరు విప్పడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. వాటిని కొంతమంది సర్వనాశనం చేశారంటూ బీజేపీలోని పలువురు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పటి వరకు ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఒక వేళ వస్తే ఇక్కడ నెలకున్న ఇబ్బందులను వారికి వివరించిన తర్వాతే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానని స్పష్టం చేశారు. లేకుంటే చచ్చినా.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లనని ఆయన కరాకండిగా చెప్పారు. ఇక పార్టీలోని పలువురు ఎంపీలు.. తమ పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యేను సైతం గెలిపించు లేక పోయారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, బీసీ బిల్లులపై అసెంబ్లీ సమావేశాలు అనేది కేవలం ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లింలను తీసేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని దమ్ముంటే సీబీఐకి అప్పచాలంటూ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు..







