Maganti Wife: మాగంటి గోపీనాథ్ భార్య ఎవరు..?
తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills ByElection) అందరి దృష్టీ ఉంది. ఈ ఎన్నికలో గెలుపు ఓటములు ఎంత ఆసక్తి రేపుతున్నాయో, మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం కూడా అంతకు మించిన ఆసక్తి కలిగిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha) పోటీలో నిలిచారు. ఆవిడ పోటీలో నిలబడిన మరుక్షణమే, ఆమె గోపినాథ్ భార్య కాదంటూ తొలి భార్య, కుమారుడు తెరపైకి వచ్చారు. దీంతో గోపీనాథ్ భార్య ఎవరనే అంశంపై పెద్ద వివాదమే తలెత్తింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ మూడు ఎన్నికల్లోనూ ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఆ అఫిడవిట్ లో మాగంటి సునీతనే భార్యగా పేర్కొన్నారు. ఆవిడే అన్నింటిలో నామినీగా ఉన్నారు. వాత్సల్యనాథ్, అక్షరనగ, దిశిరలను తన పిల్లలుగా పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ భార్య, పిల్లలపై వివాదం తలెత్తలేదు.
అయితే ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ వేసిన వెంటనే, గోపీనాథ్‌కు చట్టబద్ధమైన భార్య ఎవరు అనే విషయంపై పెద్ద దుమారం రేగింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే, గోపీనాథ్ మొదటి భార్యగా చెప్పుకుంటున్న మాలినీదేవి, ఆమె కుమారుడు తారక్ ప్రద్యుమ్న హఠాత్తుగా తెరపైకి వచ్చారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మొదటి భార్యగా చెప్పుకుంటున్న మాలినీదేవి తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై జరిగిన విచారణకు మహానందకుమారి హాజరయ్యారు. సునీతను గోపీనాథ్ అధికారికంగా పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. తన కుమారుడే గోపీనాథ్ అసలైన వారసుడని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి కూడా మొదటి భార్య వైపు నిలబడింది. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా తనను చూడనివ్వలేదని, ఈ విషయంలో కేటీఆర్‌కు చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
మాలినీదేవియే గోపీనాథ్‌కు చట్టపరమైన భార్య అని, తానే అసలైన వారసుడని ప్రద్యుమ్న ప్రకటించారు. గోపీనాథ్, సునీతను వివాహం చేసుకోలేదని, కేవలం సహజీవనం చేశారని ప్రద్యుమ్న ఆరోపించారు. తమ పోరాటం రాజకీయం కోసమో, ఆస్తుల కోసమో కాదన్నారు. కేవలం గుర్తింపు కోసమేనని చెప్పారు. నువ్వు ఎవరి కొడుకువి? అని ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికి తన తండ్రి పేరు కావాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మరణించే వరకు తాను ఆయనతో టచ్‌లోనే ఉన్నానన్నారు. అయితే అంత్యక్రియలకు కూడా తమను రానివ్వకుండా పువ్వాడ అజయ్, మోహన్ ముళ్లపూడి బెదిరించారని ఆరోపించారు. ప్రాణహాని ఉందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అయితే మాలినీ దేవి ఆరోపణలను మాగంటి సునీత వర్గం ఖండించింది. 2000 సంవత్సరం జూలైలో గోపీనాథ్‌తో సునీతు వివాహం జరిగిందని చెప్తున్నారు. 25 ఏళ్లుగా వారు కలిసి ఉంటున్నారన్నారు. సునీతతో ఆమె పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్యలకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు వంటి డాక్యుమెంట్లను తహసీల్దార్‌కు సమర్పించారు. గోపీనాథ్ మూడుసార్లు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను కూడా అందించారు. ఎమ్మెల్యే భాగస్వాములకు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చే కార్డును సునీత తరపు న్యాయవాదులు సమర్పించారు. బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా సునీత ఉన్న డాక్యుమెంట్లు కూడా అందించారు.
శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకటరెడ్డి ఇరు వర్గాల నుంచి ఆధారాలను స్వీకరించారు. అయితే మరిన్ని పత్రాలు సమర్పించడానికి ఇరువర్గాలు మరికొంత గడువు కోరాయి. దీంతో తదుపరి విచారణను తహసీల్దార్ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 19లోపు డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఉపఎన్నిక వేళ ఈ వివాదం బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.







