Revanth Reddy: పాపం సిఎం రేవంత్.. సపోర్ట్ ఎక్కడ…?

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కంటే కూడా కొన్ని సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటుంది. ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆరోపణల కంటే స్వపక్షంలో ఉన్న కొంత మంది నేతల మౌనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో పాటుగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కాపాడుకునే విషయంలో విఫలమవుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు అన్ని విషయాల్లో మౌనంగా ఉండటం సంచలనం అవుతుంది.
ఇటీవల కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఆవాస్ యోజన కార్యక్రమం కింద తెలంగాణలో ఇల్లు ఇస్తున్నట్లు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రావు అంటూ హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కూడా వాడాలని డిమాండ్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. బండి సంజయ్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాల వాటా కూడా ఉంది.. కాబట్టి రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటో వాడాలనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. అలాగే రైతుబంధు విషయంలో కూడా గులాబీ పార్టీ హయాంలో మూడు లక్షల ఎకరాలకు అక్రమంగా చెల్లించారనే ఆరోపణలు వినిపించాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సాక్షాలతో సహా రుజువు చేసింది.
అయినా సరే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీనిపై పెద్దగా స్పందించే ప్రయత్నం చేయలేదు. ఒక వరంగల్ జిల్లాలోని 174 కోట్ల రూపాయలను బిఆర్ఎస్ సానుభూతిపరులకు చెల్లించినట్లు గుర్తించారు. అయినా సరే దీనిపై వరంగల్ జిల్లా నేతలు కూడా మాట్లాడే సాహసం చేయలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు.