హైదరాబాద్‌లో విన్‌ఫాస్ట్ పెట్టుబడులు

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో విన్‌ఫాస్ట్ కంపెనీ భారత సీఈవో ఫామ్ సాన్హ చౌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు. ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, అర్బన్ మొబిలిటీలో సొల్యూషన్స్ భవిష్యత్‌లో నగరాల అభివృద్ధి, అందుకు తగ్గట్టుగా సామాజిక గృహ నిర్మాణాలు తదితర అంశాలపై మంత్రి వారితో చర్చలు జరిపారు. ప్రపంచం లోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. పెరుగుతున్న పట్టణ వలసల కారణంగా వచ్చే 15 ఏళ్లలో తెలంగాణ జనాభాలో సగం మందికి ఇది నిలయంగా మారనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. అందుకోసం విశ్వసనీయమైన భాగస్వాముల సహకారం అవసరం అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇందుకు విన్‌ఫాస్ట్ తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో భారీ వాణిజ్య సదుపాయాల మౌలిక వసతుల కల్పనే కాకుండా సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణాలపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.