TDP: సస్పెన్స్ కు తెరదించిన టీడీపీ.. పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన..!!
తెలుగుదేశం పార్టీ (TDP) సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లోక్‌సభ నియోజకవర్గాలకు కొత్త సారథులను ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ నియామకాల కోసం పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
ఈ నియామకాల్లో టీడీపీ అధిష్టానం సామాజిక సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మొత్తం 25 నియోజకవర్గాల అధ్యక్ష పదవుల్లో బీసీలకు 8, ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు 1 స్థానాన్ని కేటాయించి అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించింది.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అధ్యక్షుడిగా మోదవలస రమేశ్, ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠల్ రావు నియామకమయ్యారు. అరకు (ST) నియోజకవర్గానికి మోజోరు తేజోవతి అధ్యక్షురాలిగా ఎంపిక కాగా, విజయనగరానికి కిమిడి నాగార్జున, విశాఖపట్నానికి చోడే వెంకట పట్టాభిరాం బాధ్యతలు చేపట్టనున్నారు.
గోదావరి జిల్లాల్లో కాకినాడకు జ్యోతుల నవీన్, అమలాపురానికి గుత్తల సాయి, రాజమండ్రికి బొడ్డు వెంకట రమణ చౌదరి సారథ్యం వహించనున్నారు. అలాగే ఏలూరు బాధ్యతలను బడేటి రాధాకృష్ణకు, నర్సాపురం బాధ్యతలను మంతెన రామరాజుకు అప్పగించారు.
విజయవాడ లోక్‌సభ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, మచిలీపట్నానికి వీరంకి గురుమూర్తి ఎంపికయ్యారు. గుంటూరు అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, నర్సరావుపేటకు షేక్ జానే సైదా, బాపట్లకు సలగల రాజశేఖర్ బాబులను నియమించారు. ఇక దక్షిణ కోస్తాలో ఒంగోలు అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహా రెడ్డి, నెల్లూరుకు బీద రవిచంద్ర బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
రాయలసీమ ప్రాంతంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి లోక్‌సభ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, చిత్తూరుకు షణ్ముగ రెడ్డి, రాజంపేటకు సుగవాసి ప్రసాద్ బాబు నియమితులయ్యారు. కడప బాధ్యతలను చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డికి అప్పగించగా, అనంతపురానికి పూల నాగరాజు, హిందూపూర్‌కు ఎం.ఎస్. రాజు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా గుడిశె కృష్ణమ్మ, నంద్యాలకు గౌరు చరితారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని, రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. చాలా కాలంగా పదవుల కోసం వేచి చూస్తున్న నేతలకు ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.






