Pawan Kalyan: పవన్ ముఖ్యమంత్రి కావాలని వైసీపీకి అంత తపన ఎందుకు..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం బలంగా ఉందన్న అభిప్రాయం మూడు పార్టీల నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పరస్పర భేదాలు పక్కన పెట్టి, ఒక క్రమశిక్షణతో ముందుకు సాగాలన్న దిశగా కూటమి నాయకత్వం వ్యవహరిస్తోంది. పరిపాలనలోనూ, రాజకీయ నిర్ణయాల్లోనూ సమన్వయాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటూ అడుగులు వేస్తుండటమే ఈ బలానికి కారణంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) పెద్ద సమస్యగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
కూటమిలో చీలికలు తేవాలన్న ఉద్దేశంతో ప్రతిసారి విమర్శలు చేయడం, అనుమానాలు రేకెత్తించడం వైసీపీ అలవాటుగా మారిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సందర్భం దొరికితే చాలు, భేదాభిప్రాయాలంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే అటువంటి వ్యాఖ్యలు వెలువడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముగ్గురూ వ్యక్తిగత లాభనష్టాలు చూడకుండా కూటమి ఐక్యతే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ పలు వేదికల్లో మరో 15 ఏళ్ల పాటు కూడా ఈ కూటమి ఇలాగే బలంగా కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనిని వైసీపీ వక్రంగా అర్థం చేసుకుని, మళ్లీ మళ్లీ అదే వ్యాఖ్యలను తిప్పి కొడుతోందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను తీసుకుని, భవిష్యత్తు రాజకీయాలపై ప్రశ్నలు సంధించడం ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని కూటమి శ్రేణులు అంటున్నాయి.
కూటమిలో పవన్‌కు ఉన్న స్థానం గురించి వైసీపీకి అర్థం కాని విషయం చాలా ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, పవన్‌ను ఉపముఖ్యమంత్రిగా గౌరవంగా చూసుకుంటూ, నిర్ణయాల్లో భాగస్వామిని చేస్తున్నారని నేతలు చెబుతున్నారు. ఎక్కడా అధికారం–హోదాల మధ్య తేడా చూపించకుండా, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతున్నారన్న మాట వినిపిస్తోంది. లోకేష్ కూడా పవన్‌ను అన్నగా పిలుస్తూ, రాజకీయంతో పాటు వ్యక్తిగత బంధాన్ని కొనసాగించడం కూటమి బలానికి మరో కారణంగా మారిందని అంటున్నారు.
ఎన్నికల ముందు నుంచే కూటమిలో చీలికలు తేవాలన్న ప్రయత్నాలు జరిగాయని, కానీ ప్రతి సందర్భంలో వాటిని సమర్థంగా తిప్పికొట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా కూటమి ఎందుకు అవసరమో నాయకత్వం తరచూ వివరిస్తోంది. పవన్ స్థాయి ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండగా, పవన్ కూడా చంద్రబాబు పాలనా దక్షతను ప్రశంసిస్తూ క్యాబినెట్ సమావేశాల్లో సూచనలు స్వీకరిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ మాత్రం అదే విమర్శల పాట పాడుతుండటంతో, పవన్ సీఎం కావాలన్న కోరిక వైసీపీకి ఎందుకు అంతగా ఉందన్న ప్రశ్న నెటిజన్ల నుంచి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.






