Anil Kumar Yadav: నెల్లూరు రాజకీయాల్లో అనిల్ మౌనం.. వైసీపీకి తగ్గుతున్న ప్రాభవం..
నెల్లూరు రాజకీయాలను ఒకప్పుడు శాసించిన వైసీపీ కీలక నేతగా గుర్తింపు పొందిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (Poluboina Anil Kumar Yadav) ప్రస్తుతం పూర్తిగా మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, బలమైన గ్రౌండ్ లీడర్‌గా పేరున్న అనిల్ రాజకీయంగా యాక్టివ్‌గా కనిపించకపోవడం వైసీపీకి (YCP) ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల నెల్లూరు (Nellore) మున్సిపల్ కార్పొరేషన్లో (Municipal Corporation) మేయర్‌గా ఉన్న స్రవంతి (Mayor Sravanthi) రాజీనామా చేయడం పెద్ద దుమారం రేపింది. ఈ పరిణామంతో ఆ పదవిని టీడీపీ (TDP) దక్కించుకునే అవకాశాలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో వైసీపీ తరఫున బలమైన నాయకత్వం కనిపించకపోవడం పార్టీ బలహీనతను బయటపెడుతోందని విమర్శలు వస్తున్నాయి.
పార్టీలో అనిల్ కుమార్ పాత్ర బలంగా ఉంటే మేయర్ రాజీనామా వరకు వ్యవహారం వెళ్లేదే కాదని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులను ఏకం చేయడం, సమస్యను ముందే చక్కదిద్దడం అనిల్ చేయగలిగేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన నుంచి అలాంటి ప్రయత్నాలు కనిపించకపోవడంతో అసలు కారణం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
గత ఎన్నికల్లో నరసరావుపేట (Narasaraopet) పార్లమెంట్ నియోజకవర్గం ( Parliament Constituency) నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ నెల్లూరు నగర రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన భావించినా, పార్టీ నుంచి అధికారిక బాధ్యతలు మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. ఈ అంశమే ఆయన నిరాశకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పార్టీ శ్రేణులు కూడా అనిల్ వెంట నిలబడకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
ఉద్దేశపూర్వకంగానే పార్టీ తనను పక్కన పెట్టిందన్న భావన అనిల్ అనుచరుల్లో బలంగా ఉంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన కొందరు నాయకుల పాత్ర కూడా దీనికి కారణమని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశాలపై పార్టీ అధిష్టానం స్పందించకపోవడం అనిల్ మౌనానికి మరో కారణంగా మారిందని అంటున్నారు.
ఒకప్పుడు తన అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కూడా కట్టలేని స్థితి ఉన్న నెల్లూరు సిటీ (Nellore City)లో ఇప్పుడు తన మాటకు విలువ లేకపోవడం అనిల్‌కు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా సొంత బాబాయి టీడీపీలో చేరడం రాజకీయంగా ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో అనిల్‌కు మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందా, లేక నెల్లూరు రాజకీయాల్లో ఆయన పాత్ర ముగింపు దశకు చేరిందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నెల్లూరు రాజకీయాల్లో అనిల్ ప్రభావం కనిపించడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది.






