Vijayashanti: బీజేపీ నేతలా మాట్లాడారు.. సీఈసీపై విజయశాంతి ఫైర్

ఓట్ల చోరీ ఆరోపణలపై ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) తీవ్రంగా స్పందించారు. సీఈసీ వ్యాఖ్యలు రాజ్యాంగ సంస్థ ప్రతినిధిలా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధిలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజల్లో ఉన్న సందేహాలను ప్రస్తావిస్తూ ఓట్ల చోరీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలు సమర్పించారని విజయశాంతి (Vijayashanti) గుర్తు చేశారు. వాటిని పరిశీలించి, దొంగ ఓట్లను తొలగించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని ఆమె అన్నారు. కానీ, సీఈసీ తన అసలు పనిని విస్మరించి, రాజకీయ సవాలు విసరడం ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాదనలో విశ్వసనీయత ఉందని, అందుకే సీఈసీ (CEC) రాజకీయంగా స్పందిస్తున్నారని ఆమె అన్నారు. ఎలక్షన్ కమిషన్ మోడీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలోనే సుప్రీం కోర్టు 2023లో ఒక చారిత్రక తీర్పు ఇచ్చిందని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా స్థానం కల్పించాలని సూచించిందని విజయశాంతి (Vijayashanti) గుర్తు చేశారు. ప్రస్తుతం సీఈసీ వైఖరిని చూస్తుంటే సుప్రీం కోర్టు దూరదృష్టితో ఎందుకు ఆ సూచన చేసిందో అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.