Uttam Kumar Reddy: కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజలాలను అక్రమంగా తరలిస్తోందని ఆరోపించిన ఆయన.. దీన్ని కేంద్రం అడ్డుకోవాలని కోరారు. జయపురలో కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదలశాఖ మంత్రుల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు. అలాగే 55 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న మూసీ పునరుజ్జీవ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చి ప్రోత్సహించాలన్నారు. గంగా, యమునా పునరుద్ధరణకు అందించినట్లే మూసీ అభివృద్ధికి కూడా సహకారం అందించాలని కోరారు. మూసీ వెంట ట్రంక్, సీవరేజ్ నెట్ వర్క్ కోసం రూ.4వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు గోదావరి జలాలను తరలించే పనులకు రూ.6వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు.
అంతేకాకుండా, కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని ఉత్తమ్ (Uttam Kumar Reddy) కోరారు. అలాగే పాలమూరు – రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే భరించాలని కోరారు. ఇదే క్రమంలో మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా తమకు అందజేయాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణను సూచించాలని ఉత్తమ్ (Uttam Kumar Reddy) చెప్పారు.