Kishan Reddy: రష్యన్ ఎనర్జీ వీక్ సదస్సుకు కిషన్‌రెడ్డికి ఆహ్వానం

రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆ దేశం అధికారికంగా కేంద్ర బొగు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని ఆహ్వానించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సలహాదారు, రష్యన్ ఎనర్జీ వీక్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆంటన్ కొబ్యాకోవో (Anton Kobyakov) , కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆహ్వానించారు. విభిన్న దేశాల పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు (Scientists) , వివిధ రంగాల నిపుణులు పాల్గొనే ఈ సదస్సులో భవిష్యత్తు అవసరాల కోసం ఇంధన సృష్టిపై చర్చిస్తారు. చమురు, బొగ్గు, గ్యాస్, విద్యుత్తు, డిజిటల్ టెక్నాలజీ, శాస్త్ర, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత తదితర రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.