హైదరాబాద్ లో ట్రంప్ రియల్టీ వెంచర్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తన రియల్టీ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నిర్వహణలోని ద ట్రంప్ ఆర్గనైజేషన్ వచ్చే ఏడాది రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఏడెనిమిది సూపర్ లగ్జరీ రెసిడెన్సియల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మూడు నుంచి ఐదు ప్రాజెక్టులు హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, చండీగఢ్ నగరాల్లో రానున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ట్రైబెకా డెవలపర్స్ అనే కంపెనీతో కలిసి ద ట్రంప్ ఆర్గనైజేషన్ ఆ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల కోసమే రూ.2,500 కోట్ల వరకు ఖర్చు చేస్తామని ట్రైబెకా డెవలపర్స్ ప్రమోటర్ కల్పేశ్ మెహతా తెలిపారు. ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ది ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా పాల్గొన్నారు. ట్రంప్ బ్రాండ్ పేరుతోనే ఈ హైఎండ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తామని ట్రంప్ జూనియర్ తెలిపారు. అమెరికా తర్వాత ద ట్రంప్ ఆర్గనైజేషన్‌కు భారత రియాల్టీ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. భారత మార్కెట్‌పై దృష్టి పెట్టేందుకు గాను గత పదేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అమెరికాలో తనతో కలిసి చదువుకున్న కల్పేశ్ మెహతా ప్రమోట్ చేసిన ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి పనిచేస్తున్నారు.