Revanth Reddy: సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్న రేవంత్ రెడ్డి..!

సహజంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ (telugu cinema industry) రాజకీయాలను శాసిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. సినిమా ఇండస్ట్రీని కూడా రాజకీయాలు శాసిస్తున్నాయి. ఇందుకు పురుడు పోసింది వై.ఎస్.జగన్ (YS Jagan) అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకూ సినిమా వాళ్లను ఏమైనా అనాలన్నా, వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నా నేతలు, ప్రభుత్వాలు భయపడేవి. కానీ జగన్ మాత్రం ఇండస్ట్రీ వాళ్లను తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నారు. సినిమా స్టాల్ వార్ట్స్ కూడా వంగి వెంగి దండాలు పెట్టేలా చేసుకున్నారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా సినిమా ఇండస్ట్రీని దారికి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇక పుష్ప 2 (Pushpa 2) గొడవ తర్వాత అల్లు అర్జున్ ను అరెస్టు (Allu Arjun Arrest) చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి సాష్టాంగ పడడం మొదలు పెట్టింది.
తాజాగా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె పెద్ద వివాదానికి దారి తీసింది. కార్మికుల జీతాలు పెంచేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు సిద్ధంగా లేకపోవడం, కార్మికులు వెనక్కు తగ్గకపోవడంతో షూటింగ్స్ బంద్ అయిపోయాయి. దీనికి ముగింపు పలికేందుకు చిరంజీవి లాంటి పెద్దలు జోక్యం చేసుకున్నా కూడా ఫలితం దక్కలేదు. దీంతో రేవంత్ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, దర్శకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. వివాదానికి ముగింపు పలికినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి కొన్ని ఘాటు హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇండస్ట్రీకి ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, అదే సమయంలో ఇండస్ట్రీని గంపగుత్తగా చేతుల్లో పెట్టుకుని నియంత్రిస్తామంటే మాత్రం కుదరదని స్పష్టం చేసినట్లు సమాచారం. కార్మికులు లేదా ఇతర కళాకారులకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని, వాళ్ల డిమాండ్లలో సహేతుకత ఉంటే సామరస్యంగా పరిష్కరించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు, దర్శకులు రేవంత్ రెడ్డి మాటలకు తలూపినట్లు సమాచారం.
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతోంది. అయినా ఇంతవరకూ ఇండస్ట్రీ ప్రముఖులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేదు. ఇదే విషయాన్ని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) లేవనెత్తారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా సినిమా పెద్దలు కలిసేందుకు ఉబలాటపడుతున్నారు. దీన్ని బట్టి ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది.