Thummala Nageswara Rao: బీజేపీ అధ్యక్షుడికి అవగాహన లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుకు సరైన అవగాహన లేదని, అందుకే ఆయన సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, యూరియా సరఫరాలో కొరత లేకుండా చూడాలని బీజేపీకి సూచించారు. సవాళ్లు చేయడం మానేసి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తుమ్మల (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో కృత్రిమ యూరియా కొరత ఆందోళనలను సృష్టిస్తున్నాయని, రైతులు వారి ఉచ్చులో పడకుండా ఆలోచించాలని కోరారు. బఫర్ స్టాక్స్ విషయంలో ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి ఎరువులను ముందుగానే నిల్వ చేయాలని ప్రతిపాదిస్తే, కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్లనే ఈ కొరత ఏర్పడిందని ఆయన (Thummala Nageswara Rao) వివరించారు. ఈ వారంలోనే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను ఆయన కోరారు.







