Telugu Thalli: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు.. అసలేం జరిగింది..?

హైదరాబాద్ నగరంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ (Telugu Thalli Flyover) కు చారిత్రక ప్రాధాన్యముంది. ఇదొక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లిగా (Telangana Thalli Flyover) మార్చింది ప్రభుత్వం. ఈ పేరు మార్పుపై వివాదం తలెత్తింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చి, కొత్త బోర్డులు అమర్చిన మర్నాడే, ఆ బోర్డులపై ముసుగు కనిపిస్తోంది. ఆ పేరు కనిపించకుండా గుడ్డతో కప్పేశారు. దీంతో పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అనే అనుమానాలు తలెత్తాయి. తెలుగు గుర్తింపు, తెలంగాణ ఆత్మగౌరవం మధ్య ఈ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుందనే భావన కలుగుతోంది.
తెలుగు తల్లి ఫ్లైఓవర్ హైదరాబాద్ (hyderabad) రవాణా వ్యవస్థలో కీలక భాగం. లోయర్ ట్యాంక్‌బండ్ (lower tankbund) నుంచి సచివాలయం వరకు ఈ ఫ్లై ఓవర్ ఉంటుంది. అశోక్‌నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్‌తో కలిపుతుంది. 1997లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. 2005 జనవరి 22న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు పెట్టింది. 50 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందిన ఈ ఫ్లైఓవర్, తెలుగు సంస్కృతి, తెలుగు తల్లి గౌరవానికి ప్రతీకంగా నిలిచింది. హైదరాబాద్‌లోని 53 ఫ్లైఓవర్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గంలో ఇది ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పేరు మార్పాలనే డిమాండ్ మొదలైంది. తెలంగాణ ఉద్యమకారులు, ప్రాంతీయవాదులు తెలుగు తల్లి పేరు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదని, అది తమకు అక్కర్లేదని వాదించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించాలని సూచించారు. అందులో భాగంగా 2023లో సచివాలయం సమీపంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించారు. తెలుగు తల్లి విగ్రహం ద్వారా వచ్చిన తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును కూడా ఇప్పుడు మార్చేశారు.
సెప్టెంబర్ 24న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ ఈ పేరు మార్పును ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని GHMCకు సూచించింది. సెప్టెంబర్ 30న రాత్రి, ఫ్లైఓవర్ ప్రారంభంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని బోర్డులు అమర్చారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి కూడా ఫ్లై ఓవర్ పేరు మార్పు ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మరింత రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని అర్థమవుతోంది.
కానీ ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణలో మాట్లాడేది కూడా తెలుగు భాషే. అలాంటప్పుడు తెలుగు తల్లి, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ లాంటి వాటిని వదులుకోవాల్సిన అవసరం ఏముందని పలువురు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అంటే అది ఆంధ్రాకు సంబంధం.. తెలంగాణకు సంబంధం లేదన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్యే కాక, భాషా పరంగా కూడా ఇది సాంస్కృతిక విభజనకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ మాత్రమే ఇలాంటి సెంటిమెంటును రగిల్చి రాజకీయ లబ్ది పొందేది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ కోవలోనే పయనిస్తున్నాయని అర్థమవుతోంది.
అయితే… తాజాగా కొత్త బోర్డుపై తెల్లటి గుడ్డ దర్శనమిచ్చింది. పేరు కనిపించకుండా కప్పేశారు. దీనికి కారణాలు తెలియట్లేదు. అయితే విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.