Telangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) షెడ్యూల్ విడుదలైంది. ఐదు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) ఇవాళ మీడియా సమావేశంలో డీటెయిల్డ్ షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ క్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. నవంబర్ 11 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే రిజర్వేషన్ల ఖరారు ఆలస్యం కావడంతో షెడ్యూల్ మారింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 2019లో చివరిసారి ఎన్నికల జరిగాయి. ఐదేళ్ల గడువు ముగిసినా కూడా అనేక అవాంతరాల వల్ల ఎన్నికలు జరగలేదు. రిజర్వేషన్లు, కోవిడ్ మహమ్మారి, రాజకీయ పరిణామాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ఇది మొత్తం రిజర్వేషన్‌ను 67 శాతానికి పెంచింది. దీంతో ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. తొలి దశ అక్టోబర్ 23న, రెండో దశ అక్టోబర్ 27న పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8న ఈ ఎన్నికలు ఉంటాయి. అయితే ఫలితాలు మాత్రం ఒకేసారి విడుదలవుతాయి. ఎంపీటీసీ-జడ్పీటీసీ ఫలితాలను సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాతే నవంబర్ 11న వెల్లడవుతాయి.
రాష్ట్రంలో 31 జిల్లాలు, 555 మండలాల్లో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీల్లో 12,769 సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్ స్థానాలు ఉన్నాయి. మొత్తం 1.67 కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. దీనికోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- రెండో విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన: అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
గ్రామ పంచాయతీ ఎన్నికలు- తొలి విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
పరిశీలన: అక్టోబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 23
ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్ 31
గ్రామ పంచాయతీ ఎన్నికలు-రెండో విడత
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21
చివరి తేదీ: అక్టోబర్ 23
పరిశీలన: అక్టోబర్ 24
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4
గ్రామ పంచాయతీ ఎన్నికలు-మూడో విడత
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25
చివరి తేదీ: అక్టోబర్ 27
పరిశీలన: అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8
ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) ఉవ్విళ్లూరుతున్నాయి. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటిచెప్పేందుకు కాంగ్రెస్ ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పాలనుకుంటోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమదే గెలుపు అని బీఆర్ఎస్ చెప్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పై పైచేయి సాధించాలనుకుంటోంది.