Telangana: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ విజయవంతంకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన బ్రాండిరగ్‌పై సీఎం ఉన్నతాధికారులతోనూ, మంత్రులతోనూ సమీక్షలు నిర్వహించారు. సమ్మిట్ ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించిన సీఎం పలు మార్పులు చేర్పులు సూచించారు. హైదరాబాద్‌ను ‘ఫ్యూచర్ సిటీ’గా ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో, నగరంలో చేపడుతున్న ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాలు, ముఖ్యంగా ఇన్నర్, ఔటర్, రాబోయే రీజినల్ రింగ్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, పోర్టు కనెక్టివిటీ, రైలు మార్గం, డ్రై పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అనుకూలతను సమగ్రంగా వివరించాలని ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉందని, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. కందుకూరు మండలం బేగర్కంచలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనబోతున్న ఈ సమ్మిట్, తెలంగాణ అభివృద్ధికి కీలక వేదికగా మారనున్నదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, బహిరంగ వసతులు, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇన్?ఫ్రాస్ట్రక్చర్ ప్రగతి లాంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారుల నుండి నివేదికలను స్వీకరించి వివరణాత్మకంగా వివరాలు తెలుసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ భారీ కార్యక్రమం రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచుతుందని, ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సుకు కేంద్ర మంత్రులతో పాటు ఆహ్వానిం చాల్సిన దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రమఖుల జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా చూడాలని ఆయన అన్నారు. పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమ్మిట్‌లో సంక్షేమం, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు తదితర విభాగాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి ఈవెంట్ బాధ్యతను ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన డిజైన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 2,600 మందిని సమ్మిట్‌కు ఆహ్వానించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
రాష్ట్ర కళలు, సంస్కృతి, భాష, మరియు వాతావరణ అనుకూలతను వివరించాలని తెలిపారు. తెలంగాణ బ్రాండిరగ్‌కు సంబంధించి, రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన అంశాలకు ప్రచారంలో చోటు కల్పించాలని ఆదేశించారు. ఇందులో రామప్ప ఆలయ నంది, సమ్మక్క-సారలమ్మ జాతర, నల్లమల పులులు, మహబూబ్‌నగర్ జిల్లా ఎద్దులు వంటి సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. వీటితో పాటు, జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగు ప్రముఖులు, క్రీడాకారులను కూడా బ్రాండిరగ్లో ఉపయోగించుకోవాలని సూచించారు. పాలనలో స్థిరత్వాన్ని నొక్కి చెప్పడానికి, 1999 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదనే అంశాన్ని పెట్టుబడిదారులకు బలంగా వివరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సూచించారు.
సమ్మిట్ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుందని, పాస్‌లు లేకుండా సమ్మిట్‌కు ఎవరూ ఎంట్రీ కావడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదన్నారు. అధికారులకు శాఖల వారీగా ఎంట్రీ ఉంటుంద న్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తానే స్వయంగా పరిశీలిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, సమ్మిట్ కు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది రావొద్దని స్పష్టం చేశారు. బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమ్మిట్‌కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో’ భాగంగా వచ్చే నెల (డిసెంబర్) 8, 9 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్వహిం చాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వ స్టాళ్లు, పలు ప్రైవేటు కంపెనీల స్టాళ్లు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
2035 నాటికి తెలంగాణ రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం 2047 నాటికి సమృద్ధి, సమానత్వం, సుస్థిరతతో కూడిన అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను తయారు చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని దేశ జీడీపీలో 10శాతం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుంది. ఐఎస్బీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ విభాగం ఈ డాక్యుమెంట్‌ను తయారు చేస్తోంది. డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్-జీరో లక్ష్యంగా మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ రెడీ అవుతోంది.
అన్ని విభాగాలు తమ భవిష్యత్ లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వనించాలని ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతోపాటు అత్యున్నత భద్రత కల్పించాలని కోరారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు.






