దేశంలోనే ఈసారి తెలంగాణకు మాత్రమే… ఈ పతకం

విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి, అసమాన ధైర్య సహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతకం ( పీఎంజీ) ఆయనకు దక్కింది. పోలీసుల కిచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పతకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. రెండేళ్ల క్రితం గొలుసుదొంగను పట్టుకునే క్రమంలో ఏడుసార్లు కత్తిపోట్లకు గురైనా వెరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న ధీశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో 28 మంది అధికారులు వివిధ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో పాల్గొనే సీఏపీఎఫ్ బలగాలు, వివిధ విభాగాల పోలీసులకు దక్కే రాష్ట్రపతి శౌర్య పతకం ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీస్‌కు లభించడం అరుదు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ తన కార్యాలయంలో యాదయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీలు సంజయ్ కుమార్ జైన్, విజయ్‌కుమార్, ఐజీపీ రమేశ్ పాల్గొన్నారు.