Nara Lokesh: పవన్ మాటలకు లోకేష్ స్పష్టత.. ఫుల్ ఖుష్ అవుతున్న జనసేన..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనూహ్య నిర్ణయాలు తీసుకునే నేతగా ఎప్పటినుంచో గుర్తింపు పొందారు. రాజకీయ అనుభవం తక్కువని కొందరు విమర్శించినా, ఆయన తీసుకునే నిర్ణయాలను గమనిస్తే స్పష్టమైన దూరదృష్టి కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తన రాజకీయ ప్రయాణంలో ప్రతి అడుగును స్పష్టమైన ఆలోచనతోనే వేస్తారన్నది ఆయన తీరు చూస్తే అర్థమవుతుంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తేల్చడమే కాకుండా, కష్టకాలంలో ఉన్న చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu)కు నిజమైన మిత్రుడిగా అండగా నిలిచిన తీరు అందరికీ తెలిసిందే.
సాధారణంగా రాజకీయాల్లో అవకాశాలు చూసుకుని నిర్ణయాలు తీసుకునే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పవన్ మాత్రం రాజకీయ లాభనష్టాల కంటే రాష్ట్ర ప్రయోజనాలనే ప్రాధాన్యంగా చూసే నేతగా ముందుకు వచ్చారు. పొత్తు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలా హుందాగా ఎదుర్కొంటూ, ఎక్కడా ఘర్షణలకు తావివ్వకుండా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అదే సమయంలో జనసేనకు ఎలాంటి అసంతృప్తి కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ సమన్వయాన్ని కొనసాగిస్తున్నారు.
పవన్ తరచుగా వచ్చే పదిహేనేళ్ల పాటు టీడీపీతో కలిసి ప్రయాణిస్తామని చెబుతుంటారు. అయితే ఈ మాటలకు ఇప్పటివరకు తెలుగుదేశం నేతల నుంచి అంత స్పష్టమైన స్పందన రాకపోవడం జనసేన అభిమానుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది. అయినా పవన్ మాత్రం అలాంటి విమర్శలకు స్పందించకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరియు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని పదే పదే చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదిహేనేళ్ల పాటు కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టంగా చెప్పడం జనసేన వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటివరకు కూటమి భవిష్యత్తు గురించి పవన్ మాత్రమే మాట్లాడుతున్నారన్న భావనకు ఈ వ్యాఖ్యలతో ముగింపు పలికినట్లైంది.
లోకేశ్ గతంలో చెప్పిన సాధారణ సమన్వయ మాటలకంటే భిన్నంగా, ఈసారి చాలా స్పష్టంగా పవన్ లైన్లోనే మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కూటమి బలంగా ఉందన్న సాధారణ వ్యాఖ్యలకంటే, పదిహేనేళ్ల పాటు కలిసి ప్రయాణిస్తామని చెప్పడం ద్వారా జనసేనలో ఉన్న సందేహాలు, అసహనాన్ని ఆయన తొలగించినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రకటన పవన్ మాటలు వన్ సైడ్ అన్న భావనను కూడా తగ్గించిందని చెబుతున్నారు.
ముఖ్యంగా కాపు యువత ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా లోకేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ పొత్తు బంధంపై చంద్రబాబు నోటి నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రావాలని జనసేన శ్రేణులు ఆశిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, కూటమి భవిష్యత్తు ప్రయాణంపై వచ్చిన ఈ స్పష్టత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందని చెప్పవచ్చు.






