Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్ట్ స్టే..!

తెలంగాణలో (Telangana) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబంర్ 9 అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ ఆగిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషనర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పుల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి కేటాయించే మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం పరిమితిని మించరాదు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేటాయించడం ద్వారా, ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి, ఈ మొత్తం రిజర్వేషన్ల శాతం 50 శాతం పరిమితిని దాటిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, జీవో చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, దీని అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 9 అమలును తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. దీని ఫలితంగా, ఆ జీవో ఆధారంగా విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, రిజర్వేషన్ల కేటాయింపును సమర్థిస్తూ నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తదుపరి ఆరు వారాల విచారణ వరకు ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ఈ పరిణామం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని సృష్టించింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి ప్రభుత్వం నూతన జీవోను తీసుకొస్తుందా లేదా తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటుందా అనే అంశాలపైనే ఎన్నికల ప్రక్రియ తిరిగి పట్టాలెక్కడం ఆధారపడి ఉంటుంది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికల యంత్రాంగం నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.