IAS Srilakshmi: శ్రీలక్ష్మికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..! ఓఎంసీ కేసుపై మళ్ళీ విచారిణ..!!

ఓబులాపురం మైనింగ్ కేసులో (Obulapuram Mining Case) ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మికి (Srilakshmi IAS) తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC)కి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నమోదైన కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు నుంచి తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. ఈ తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ (CBI) మళ్లీ విచారణ చేపట్టనుంది.
ఓబులాపురం మైనింగ్ కేసు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాలో జరిగిన అక్రమ ఇనుప ఖనిజ తవ్వకాలకు సంబంధించినది. 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఓఎంసీకి గనుల లీజులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) నేతృత్వంలోని ఓఎంసీ అనంతపురం, బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వి, విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం చేసి, నిబంధనలకు విరుద్ధంగా లీజులు మంజూరు చేశారని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. 2011లో ఈ కేసులో శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
2011లో సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. ఓఎంసీ రూ.884.13 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు తేల్చింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లతో పాటు శ్రీలక్ష్మి నిందితులుగా ఉన్నారు. 2022లో తెలంగాణ హైకోర్టు జస్టిస్ చిల్లకూరు సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదించింది. సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టు తీర్పును కొట్టివేసి, మూడు నెలల్లోగా శ్రీలక్ష్మి కేసును మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను ఇవాళ (జులై 25, 2025) కొట్టివేసింది. ఈ తీర్పుతో శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చిన హైకోర్టు, ఆమె పాత్రపై సీబీఐ కోర్టులో మళ్లీ ట్రయల్ జరగనుందని స్పష్టం చేసింది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు 2025 మేలో సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. అయితే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీలక్ష్మి కేసు మాత్రం హైకోర్టు తాజా తీర్పుతో మళ్లీ విచారణ దశకు చేరింది. 2022లో హైకోర్టు తీర్పుతో ఊరట లభించిన శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పులతో మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. సీబీఐ కోర్టులో జరగనున్న ట్రయల్ ఈ కేసులో ఆమె పాత్రను స్పష్టం చేయనుంది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలన రంగాల్లో సంచలనంగా మారింది.