Kaleswaram: కాళేశ్వరంపై ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్..!

తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు- కాళేశ్వరం (Kaleswaram). అయితే ఇది రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్లలో గుర్తించబడిన నిర్మాణ లోపాలు ప్రాజెక్టు మనుగడకు సవాల్ విసిరాయి. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లలో నీటి లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో లక్ష కోట్ల వ్యయంతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు కమిషన్ ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్టు మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ … ఈ రిజర్వాయర్లకు మరమ్మతు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకోసం టెండర్లను ఆహ్వానించింది.
2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు రూ. 94 వేల కోట్ల ఖర్చు చేసింది. గోదావరి నీటిని ఎత్తి పోసి రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే, 2023లో మేడిగడ్డ బ్యారేజ్‌లో భారీ వర్షాలు, నిర్మాణ లోపాల వల్ల పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్లలో క్రాక్‌లు, సీపేజీ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ లోపాల వల్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. ఇరిగేషన్ ప్రయోజనాలు తగ్గాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం, ఈ బ్యారేజ్‌లలో తీవ్రమైన నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, నాణ్యత కొరవడింది. తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించింది. కాగ్ నివేదిక కూడా ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదని తేల్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇటీవలే దీన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే ఒకటి రెండు చోట్ల నిర్మాణ లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. NDSA, విజిలెన్స్ కమిషన్ సిఫార్సులను పట్టించుకోకుండా బీఆర్ఎస్‌ను బ్లేమ్ చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే NDSA సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమంటూనే.. మరోవైపు ఆ నీటితో కొత్త స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. L&T ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆమోదించట్లేదని విమర్శించారు. బీజేపీ కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ 19న ఇరిగేషన్ మంత్రి ఉత్తమే కుమార్ రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల మరమ్మతు డిజైన్ కన్సల్టెంట్లను ఎంపిక చేయాలని, ఎక్స్‌టర్నల్ ఏజెన్సీల నుండి EOI కోరాలని సూచించారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (CDO)కు డిజైన్ సామర్థ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఇరిగేషన్ శాఖ EOI జారీ చేసింది. ఈ ప్రక్రియలో భూగర్భ టెస్టులు, రివర్‌బెడ్ సర్వేలు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం తర్వాత, 2026 వేసవిలో మరమ్మతు పనులు ప్రారంభించాలని సూచించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ అటకెక్కిస్తుందనే ఆరోపణలకు చెక్ పెట్టినట్లయింది.