AI Engineers : ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్ల (AI Engineers )ను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ (Emerging Technologies ) కు హబ్‌గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ (Future City) , యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University ) గురించి వివరించారు.ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమ య్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. గ్లోబల్ కేపబిలిటి సెంటర్ల ( జీసీసీ)కు హబ్‌గా హైదరాబాద్ మారుతుంది. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటి, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం అని శ్రీధర్‌బాబు వివరించారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.