T Congress : X లో అసందర్భ పోస్ట్.. అభాసుపాలైన తెలంగాణ కాంగ్రెస్..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) అధికారంలో ఉంది. పదేళ్ల తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అండ్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ విఫలమవుతున్నట్టు అర్థమవుతోంది. మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితేనే వాళ్ల మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తమ చేతిలోని సోషల్ మీడియా (Social Media) అకౌంట్లలో పనికిరాని పోస్టులు పెట్టడం ద్వారా అభాసుపాలవుతోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా తమ అధికారిక ఎక్స్ (X) అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఓ పోల్ ఆ పార్టీ గాలి పూర్తిగా తీసేసింది.
‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు… A.ఫామ్ హౌస్ పాలన, B. ప్రజల వద్దకు పాలన’ అని బుధవారం కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోల్ పెట్టింది. ఇందులో పాల్గొనేందుకు 24 గంటల సమయం ఇచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 60 వేల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. ఇందులో 66 శాతానికి పైగా ఫామ్ హౌస్ పాలనే (Farm House Govt) కావాలని కోరుకున్నారు. ప్రజల వద్దకు పాలన కావాలని కోరుకున్న వాళ్ల శాతం 34కు మించలేదు. దీన్ని బట్టి ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయాన్ని ప్రజలు నేరుగా కాంగ్రెస్ పార్టీ మొహాన్నే చెప్పినట్లయింది.
పదేళ్లపాటు కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్ నుంచి పరిపాలించారని.. అందుకే ఆయన్ను ఓడించారని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇకపైన కూడా ఆయన ఫాంహౌస్ కే పరిమితం అవుతారని.. ఆయన మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రేవంత్ రెడ్డి పదేపదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేరుగా ప్రజలు తమకు ఆ పామ్ హౌస్ పాలనే కావాలని కోరుకున్నట్టు స్పష్టంగా చెప్పేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అభాసుపాలైందని ఎద్దేవా చేస్తున్నారు.
సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ పనితీరును ఈ సంఘటన మరోసారి బయటపెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను సరిగా వినియోగించుకోవట్లేదని.., విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతోందని విమర్శలున్నాయి. ఇప్పుడు ఏకంగా తమ అకౌంట్లోనే పనికిమాలిన పోల్ పెట్టి మరోసారి విమర్శలకు అవకాశం కల్పించింది. అలాంటి ప్రశ్నలు పెట్టాల్సిన అవసరం వాస్తవానికి లేదు. అయినా అవగాహన లేని కొంతమంది ఇలాంటి పోస్టులు పెట్టి తమ పార్టీని మరింత పలుచన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే వాపోతున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా టీంలో సమర్థులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచిస్తున్నారు.