Urea Deficiency: ఢిల్లీలో యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం
తెలంగాణలో నెలకొన్న యూరియా కొరతపై (Urea Deficiency) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పోరాటం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యూరియా కేటాయింపులు తగ్గించిందని వారు ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ ముందు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డాను (JP Nadda) కలిసి, యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంపై ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా సంతకాలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మల్లు రవి (Mallu Ravi) మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణకు 8 లక్షల టన్నుల యూరియా (Urea) ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూరియా (Urea) కోసం రైతులు ఆందోళన చేసే పరిస్థితి నెలకొందని, అందుకే పార్లమెంట్ ముందు నిరసన తెలిపినట్లు ఆయన (Mallu Ravi) చెప్పారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీలు డిమాండ్ చేశారు.