Telangana BJP: బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు ఎంపీలు..!?

తెలంగాణలో (Telangana) ఎలాగైనా పాగా వేయాలనే ఆలోచనతో పోరాడుతోంది భారతీయ జనతా పార్టీ (BJP). గత అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉండేది ఆ పార్టీ. అయితే ఎన్నికల ముందు పార్టీ సంస్థాగతంగా తీసుకున్న కొన్ని మార్పులు, చేర్పుల వల్ల ఆ పార్టీ చాలా నష్టపోయింది. అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదు. అందుకే ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటోంది. ఇందుకోసం ఆచితూచి వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బలమైన వ్యక్తికి పార్టీ పగ్గాలిచ్చేందుకు సిద్ధమవుతోంది.
మూడేళ్లకోసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంటుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో వార్డు, మండలస్థాయి అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా అధ్యక్షులను (District Presidents) నియమించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేందుకు సిద్ధమవుతోంది. అయితే జిల్లాల అధ్యక్షులు ఎంచుకున్న వారికి పగ్గాలిస్తుందా.. లేకుంటే అధిష్టానమే ఓ నేతను ఎంచుకుని అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని (Kishan Reddy) తప్పించి మరో వ్యక్తికి బాధ్యతలు ఇచ్చేందుకు హైకమాండ్ దాదాపు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
సహజంగా ఆర్ఎస్సెస్ (RSS) బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు బీజేపీ ఎక్కువగా మొగ్గు చూపుతుంటుంది. అయితే అలాంటి నిబంధన ఏదీ లేదని.. ఆరెఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడయ్యే ఛాన్స్ ఉందని ఇటీవల కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆ అదృష్టవంతుడెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కిషన్ రెడ్డి తప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) కి పగ్గాలిస్తారని ఆశించారు. అయితే ఇప్పటికే బండి సంజయ్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయనపై అంతర్గత ఫిర్యాదుల నేపథ్యంలో తప్పించారు. కాబట్టి మరోసారి ఆయనకు పగ్గాలిచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం అధ్యక్షరేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajendar) ముందువరసలో ఉన్నారు. బీసీ నేత కావడం, బలమైన ఆర్థిక నేపథ్యం ఉండడం ఈటలకు కలిసొచ్చే అంశాలు. కేసీఆర్ ను ఎదిరించి పార్టీలోకి రావడంతో హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు ఉంది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) కూడా అధ్యక్ష రేసులో ముందు వరసలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళ కావడం ఈవిడకు కలిసొచ్చే అంశాలు. ధర్మపురి అర్వింద్ (Dharmapuri Aravind), రఘునందన్ రావు (Raghunandan Rao), రామచంద్రరావు (Ramachandra Rao) కూడా పోటీలో ఉన్నా ఈటల రాజేందర్, డీకే అరుణలలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.