Telangana Assembly: అసెంబ్లీకి ముహూర్తం రెడీ.. కాళేశ్వరం నివేదికపై వాడీవేడి చర్చ..!!
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Kaleswaram Lift Irrigation Project) మరోసారి కీలక చర్చాంశంగా మారబోతోంది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh) నివేదికపై చర్చ జరగనుంది. ఈ నివేదికలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్చ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో వాడివేడి చర్చ జరగనుంది. అయితే కేసీఆర్ (KCR) ఈ చర్చకు హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని జీవనాధారంగా ప్రచారం చేసింది. గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ సహా 18 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో పాటు గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందింది. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుప్పకూలడం, అన్నారాం, సుందిళ్లలో లీకేజీలు రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఖర్చు 71వేల కోట్ల నుంచి లక్ష 45వేల కోట్లకు పెరగడంపై విమర్శలు వచ్చాయి. ఇక నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలు సంచలనం సృష్టించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇది 15 నెలల విచారణ తర్వాత 665 పేజీల నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో కేసీఆర్‌ను 32 సార్లు, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును 19 సార్లు ప్రస్తావించింది. ప్రాజెక్ట్‌లో కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలు, క్యాబినెట్ ఆమోదం లేకుండా పనులు ప్రారంభించడం, నిపుణుల సలహాలను పట్టించుకోకపోవడం వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. మేడిగడ్డకు కాళేశ్వరం మార్చడం వల్ల అదనపు ఖర్చయిందని.. డిజైన్ లోపాలు, క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ మాన్-మేడ్ డిజాస్టర్ గా మారిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను క్యాబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని తీర్మానించింది.
అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని., ఇది తెలంగాణ రైతులకు వరమని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగా నివేదికను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌ను ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అంతేకాక ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదన వినిపించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించామని, ఆ తర్వాతే దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కాళేశ్వరం నివేదికపై చర్చే ప్రధానాంశంగా ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు విషయంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాది బడ్జెట్ సెషన్లో కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. ఇప్పుడు నివేదిక కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కేసార్ చర్చలో పాల్గొంటారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆయన హాజరుకాకపోతే హరీశ్ రావు చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అసెంబ్లీ చర్చ తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది.







