పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ : మంత్రి జూపల్లి

ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని పర్యాటక ఆకర్షణలు భారతదేశంలో, తెలంగాణలో ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో పర్యాటకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 27న ప్రారంభమైన పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన స్టాట్‌ను ప్రారంభించారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోని చార్మినార్, లక్నవరం తీగల వంతెన ఛాయ చిత్రాల్ని అక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణలో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, గోల్కోండ కోట, చార్మినార్, వేయి స్తంభాల గుడి వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని తెలిపారు. ట్రావెల్ మార్ట్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. థాయ్‌లాండ్‌లో భారత అంబాసిడర్ నగేష్‌సింగ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ డైరెక్టర్ విజయ్ పాల్గొన్నారు.