Telangana: ఎమ్మెల్యేలపై వేటు ఖాయమా?
                                    తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరోసారి ఎమ్మెల్యేల అనర్హత (MLAs Disqualification) పిటిషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లోకి (Congress) ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad) విచారణను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ఈ నెలలో విచారించాల్సిన నలుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ను స్పీకర్ కార్యాలయం (Speaker ) ప్రకటించింది. ఈ విచారణల అనంతరం స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.
స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి విడత విచారణ ఈ నెల 6న ప్రారంభం కానుంది. నవంబర్ 6న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జుక్కల్ ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. మరుసటి రోజు నవంబర్ 7న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
వీళ్ల విచారణ పూర్తయిన వెంటనే రెండో విడత విచారణ తేదీలను కూడా స్పీకర్ ప్రకటించారు. నవంబర్ 12న తెల్లం వెంకట్రావ్, ఎం.సంజయ్ కుమార్ పిటిషన్లపై రెండోసారి విచారణ జరుగనుంది. నవంబర్ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది. ఇలా ఒక నెలలోనే నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై రెండుసార్లు విచారణకు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించాలనే ఆలోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్టు అర్థమవుతోంది.
ఈ అనర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అంతర్జాతీయ సదస్సులు, ఇతర కారణాల వల్ల విచారణ పూర్తి చేయలేకపోయామని స్పీకర్ కార్యాలయం అదనపు గడువు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజా విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ అనంతరం స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది.







