దేశంలోనే తొలి కాస్మెటిక్ హబ్.. హైదరాబాద్ లో ఏర్పాటు

దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మెటిక్ తయారీ సంస్థ డూసన్ హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలి కాస్మెటిక్ తయారీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డూసన్ కంపెనీ ప్రతినిధి మూన్ కీ జూ నేతృత్వంలోని బృందం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సచివాలయంలో సమావేశమైంది. తమ సంస్థ పెట్టుబడుల గురించి ప్రభుత్వానికి డీపీఆర్ అందించారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు కలిగే ప్రయజోనాల గురించి మంత్రికి వివరించారు.
తమ సంస్థ చైనా, వియత్నాం, కాంబోడియా తదితర దేశాల్లో 460 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ భారతదేశంలోనే మొదటిదని మంత్రికి తెలిపారు. తమ సంస్థ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, భూమి, రాయితీల గురించి డూసన్ ప్రతినిధులు మంత్రితో చర్చలు జరిపారు.