భాగ్యనగరం దత్తపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు

అవధూత, దత్తపీఠాధిపతి, పరమపూజ్య డా. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానద స్వామిజీ వారిచే శ్రీ క్రోధి నామ సంవత్సర దేవీ నవరాత్రి మహోత్సవములు (దసరా వేడుకలు) ది. 3.10.2024 గురువారం నుంచి 13.10.2024 ఆదివారం వరకు శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దిండిగల్ నుందు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అనేక ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమములతో పాటు ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమములు కూడా ఆశ్రమంలో జరుగనున్నది. ఈ సంవత్సరము ఏప్రిల్ మాసములో దిండిగల్ లో నూతనముగా ప్రతిష్టింపబడిన దేవాలయ ప్రాంగణము లోని సభామంటపము నందు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారల దివ్య సమక్షములో ఈ నవరాత్రి మహోత్సవములు అత్యంత పవిత్రముగా, కన్నుల పండువగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
పరమపూజ్య శ్రీగణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ తోమ్మిది రోజులు అమ్మవారి పూజలు విశేషమైన నియమ నిష్టలతో నవావరణ అర్చనలను ఎంతో పవిత్రముగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామిజీ ముందుగా గోపుజను నిర్వహించి, దత్తాత్రేయ మూర్తిని అర్చించి, విశేషంగా అలంకరింపబడిన శ్రీ రాజరాజేశ్వరీ మాత ఉపాసనను ప్రారంభిస్తారు. ముందుగా బాలపరమేశ్వరీ రూపంలో రూపంలో ఆసీనులై చిన్నపిల్లలకు కుమారీపూజ చేసి, వారిని అమ్మవారిగా భావిస్తూ హారతులను సమర్పిస్తారు. తరువాత శ్రీమాత కు శ్రీ చక్రపూజ ను నిర్వహించి, నవావరణ పూజలతో అమ్మవారిని పూజిస్తారు.
ఈ నవావరణ పూజా సమయంలో ప్రముఖ సంగీత కళాకారులు, నాద విద్యాంసులు అమ్మవారికి తమ సంగీత సేవను సమర్పించుకుంటారు. తరువాత శ్రీ స్వామిజీ వారు దేవీ హోమమునకు పూర్ణాహుతిని సమర్పించి, అన్నార్చాన కార్యక్రమును నిర్వహిస్తారు. వేదపండితులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణములను పఠిస్తూ ఉండగా శ్రీ స్వామిజీ స్ఫటిక శ్రీచక్రమునకు అభిషేకము చేస్తారు. తరువాత భక్తులు అమ్మవారికి లాలిపాట పాడుతూ ఉండగా శ్రీ స్వామిజీ రాజరాజేశ్వరీ మాతకు డోలోత్సవము ను నిర్వహిస్తారు. తరువాతా పూజా సేవలలో పాల్గొన్న భక్తులకు ప్రసాదములను అగ్రహిస్తారు. తరువాత శ్రీ స్వామిజీ అమ్మవారి వైభవములను, మహాత్స్యములను కీర్తించే గాధలను, గానం చేస్తూ అమ్మవారికి సంగీత సేవను సమర్పించి నవరాత్రి ఉత్సవములకు మరింత శోభను చేకూరుస్తారు. పదహారు (16) సంవత్సరముల తర్వాత శ్రీ స్వామిజీవారు, తిరిగి భాగ్యనగరానికి అనుగ్రహించిన ఈ నవరాత్రి మహోత్సవములలో పాల్గొనుటకు దేశ విదేశయుల నుండి కూడా భక్తులు విచ్చేసి, శ్రీమాతే కృపాకటాక్షములలను, సద్గురు దేవుల అనుగ్రహమును పొంది అలౌకిక ఆనందమును అనుభవిస్తారు.
– సుందరి చెన్నూరి