Venkappa Bhagavathulu: ఖతార్‌లో విశేష సేవలందిస్తున్న విశాఖ వాసికి అరుదైన గౌరవం
ఖతార్ (Qatar)లో గత రెండు దశాబ్దాలుగా నివసిస్తూ, ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం విశేష సేవలందిస్తున్న ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, విశాఖపట్నం వాసి వెంకప్ప భాగవతులు (Venkappa Bhagavathulu) అరుదైన అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) 4వ అంతర్జాతీయ మహాసభలో ఆయనకు “ఉత్తమ సేవా పురస్కారం” (Best Philanthropy Award) ప్రదానం చేశారు. వెంకప్ప భాగవతులు (Venkappa Bhagavathulu) గత 20 ఏళ్లుగా ఖతార్‌లో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలని గుర్తించి జీఐవో (GIO) ఈ అవార్డును ప్రకటించింది. ఆయన సేవలు కేవలం ఖతార్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విస్తరించడం విశేషం.
అవార్డు స్వీకరించిన అనంతరం వెంకప్ప భాగవతులు (Venkappa Bhagavathulu) మాట్లాడుతూ.. ఈ గౌరవం తన ఒక్కడిది కాదని, తన సేవా ప్రస్థానంలో తోడ్పాటునందించిన మిత్రులు, సహచరులు, మార్గదర్శకులు, కుటుంబ సభ్యుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ సమాజ హితం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జీఐవో (GIO) నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ వాసికి ఇంతటి గొప్ప అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ఖతార్‌లోని ప్రవాస తెలుగువారూ, ఇతర కమ్యూనిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






