Chandrababu: చంద్రబాబు మరో కోణం..పార్టీ నేతలకు కఠిన సంకేతాలా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆయన పార్టీ నేతలు నిజంగా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చాలామంది నేతలు ఆయనను ఒకే కోణంలో మాత్రమే చూస్తున్నారని, కానీ ఆయనకు మరో వైపు కూడా ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంగా చంద్రబాబు ఒకవైపు అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఉత్సాహంతో ప్రజాప్రతినిధులు కూడా పనిచేయాలని, తన వేగానికి తగ్గట్టే అడుగులు వేయాలని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
అయితే ఈ సూచనలను కొందరు నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు స్థాయిలో వేగం లేకపోయినా, కనీసం కొంత వేగంగా అయినా పని చేయాల్సిన అవసరం ఉందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. కానీ వాస్తవంగా చూస్తే కొద్దిమంది మాత్రమే ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టుతున్నారు. మిగిలినవారు మాత్రం తమ స్థానాల్లోనే ఉండిపోతూ, పెద్దగా చురుకుగా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన మరో కోణాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించే నాయకుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు సమాచారం. ఇటువంటి వారిని చంద్రబాబు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎప్పటికీ గొడవలతో కాలం గడపలేమని, పార్టీ కార్యక్రమాల కోసం సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేస్తున్నారు. అయినా కొందరిలో మార్పు కనిపించకపోవడం పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలి కాలంలో ఒకరిద్దరు నాయకులకు చంద్రబాబు స్వయంగా క్లాస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారన్న పేరు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పెద్దగా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో కొందరు నేతలు దీనిని తేలికగా తీసుకుంటున్నారన్న వాదన ఉంది. దీనివల్లే పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ లోపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) వివాదం కూడా ఇదే కోవలోకి వస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబులోని సహనాన్ని, సమన్వయాన్ని మాత్రమే చూసిన నాయకులు, ఆయన మరో వైపు గురించి ఆలోచించడం లేదని అంటున్నారు. కానీ ఒకవేళ చంద్రబాబు తన రెండో కోణాన్ని అమలు చేయడం ప్రారంభిస్తే, ప్రస్తుతం బాగానే ఉన్నా భవిష్యత్తులో పరిస్థితులు మారే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తొలిసారి గెలిచినవారైనా, అనుభవం ఉన్నవారైనా, పార్టీ లైన్ను గౌరవిస్తూ నడుచుకోవాల్సిందేనన్న సందేశం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా గుర్తింపు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చన్న భావన పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.






