Chandrababu: గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్
విశాఖపట్నం, డిసెంబర్ 12: సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు.. ఇలా అన్ని విధాలా విశాఖ రీజియన్ అభివృద్ధి కావాలని నిర్దేశించారు. విశాఖను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని, వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా జరపాలని అధికారులకు సీఎం సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఇలా 3 ఎకనమిక్ రీజియన్లు గా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై తొలిసారి విశాఖలో శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర రంగాలకు సంబంధించి 49 ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. 2024లో 52 బిలియన్ డాలర్ల జీడిపీతో ఉన్న వీఈఆర్‌ను 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 7 గ్రోత్ డ్రైవర్స్, 10 పాలసీలతో వీఈఆర్ అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
వీఈఆర్ మాస్టర్ ప్లాన్ సమర్ధంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవచ్చన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రానున్న 3 నెలల్లో ఏం చేయాలనే దానిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వీఈఆర్ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని సీఎం తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు వీఈఆర్‌లో వీలు ఉందన్నారు. అనకాపల్లిలో త్వరలో మెడ్‌టెక్ జోన్-2 ప్రారంభిస్తామని, టాయ్స్ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్ తయారీ కంపెనీలను ఆకర్షించాల్సి ఉందన్నారు. రీజియన్‌లోని ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయాలని, రహదారుల విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. ప్రతి 2 నెలలకు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
శాఖల వారీగా యాక్షన్ ప్లాన్
వీఈఆర్ కోసం వాణిజ్య పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పర్యాటకం, ఐ అండ్ ఐ, ఆర్ అండ్ బీ, ఐటీఈ అండ్ సీ, వ్యవసాయం, అటవీ, వైద్యారోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్ ఇలా శాఖల వారీగా విడివిడిగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వీఈఆర్ పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైనా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు సమిష్టిగా ముందుకొస్తే ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రలో వలసలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. అవసరానికి మించి డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించకుండా ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
ప్రాంతాలవారీ అనుకూల పంటలపై నివేదిక
‘విభిన్న పంటల సాగుకు విశాఖ రీజియన్ ఎంతో అనుకూలంగా ఉంటుందనీ ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తూనే అంతర పంటలుగా కోకో, అరటి, మిరియాలు వంటి పంటలను పండించేలా చూడాలనీ సీఎం అన్నారు. ఏ ప్రాంతం ఏ పంటలకు అనుకూలం అనే దానిపై జిల్లాల కలెక్టర్లు నివేదిక తయారు చేయాలని… ఏజెన్సీలో స్పైసెస్, స్ట్రాబెర్రీ వంటి వాటితో సహా అన్ని పంటలు పండించేందుకు అవకాశం ఉందని దానిని వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలన్నారు లాభసాటి పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ప్రయత్నించాలని.. పౌల్ట్రీ ఫామ్‌లు పెద్దఎత్తున వస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ రీజియన్‌లో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందని సాగును ప్రోత్సహించాలని సూచించారు. అన్ని చెరువులను, రిజర్వాయర్లను నింపాలనీ.. ఆక్వా కల్చర్ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను వచ్చే వీఈఆర్ సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులతో సీఎం అన్నారు.
వీఈఆర్ ఇలా…
• మొత్తం 9 జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ
• ప్రస్తుతం 1.65 కోట్ల జనాభా, 38,000 చదరపు కి.మీ విస్తీర్ణం, 52 బిలియన్ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయం, 70 లక్షల వర్క్ ఫోర్స్
• ఏపీలో వీఈఆర్ భాగస్వామ్యం… 31 శాతం భౌగోళిక విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీ
• 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి… గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్లాన్డ్ అర్బనైజేషన్-హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు
• మొత్తం 6 పోర్టులు : ప్రస్తుతం ఉన్న ఆపరేషనల్ పోర్టులు – విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టు.
కొత్త పోర్టులు – కాకినాడ గేట్ వే, మూలపేట
• కొత్తగా 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో రైల్
• 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్స్, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
• వీఈఆర్ అభివృద్ధికి అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ రూములు, 20 వరకు మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, 5,000 హాస్పటల్ బెడ్స్, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు అవసరం
ప్రత్యేక పర్యాటక కేంద్రంగా విశాఖ
కైలాసగిరి నుంచి భీమిలి వరకు 40 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటకానికి కోర్ సిటీగా అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్‌లో రూపొందించారు. ప్రధానంగా 5 బీచ్ ఫ్రంట్లు, వరల్డ్ క్లాస్ థీమ్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ హబ్‌లతో అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దనున్నారు. కైలాసగిరి మాస్టర్ ప్లాన్ కింద మెగా రీ డిజైన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్రతో పాటు సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు, 9 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.






