Delimitation: 2029లోనూ పాత సీట్లతోనే ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను సమూలంగా మారుస్తుందని భావించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీ మేరకు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని గంపెడాశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మింగుడుపడటం లేదు. కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించిన జనగణన షెడ్యూల్ ప్రకారం.. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు అసాధ్యమని స్పష్టమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికలు కూడా ప్రస్తుతమున్న పాత స్థానాలతోనే జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, రెండు కొత్త రాష్ట్రాలలో రాజకీయ స్థిరత్వం, పాలనా సౌలభ్యం కోసం అసెంబ్లీ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26(1)లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లను 153కి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 సీట్లను 225కి పెంచే వెసులుబాటు కల్పించారు.
వాస్తవానికి ఈ పెంపునకు జనగణనతో సంబంధం లేదని, కేవలం విభజన చట్టం ఆధారంగానే సీట్లు పెంచవచ్చని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వాదిస్తూ వచ్చాయి. అయితే, రాజ్యాంగంలోని 84వ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిబంధన ఉంది. కేంద్రం ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులోనూ స్పష్టం చేసింది. విభజన చట్టం ఉన్నప్పటికీ, అది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని తేల్చి చెప్పింది. దీంతో జనగణన సీట్ల పెంపునకు తప్పనిసరిగా మారింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లతో జనగణన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ టైమ్‌లైన్‌ను నిశితంగా పరిశీలిస్తే, 2029 నాటికి సీట్ల పెంపు సాధ్యం కాదని అర్థమవుతోంది. జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో లెక్కల సేకరణ, డేటా క్రోడీకరణ పూర్తయ్యి, తుది జనాభా లెక్కల నోటిఫికేషన్ రావడానికి కనీసం 2028 జూన్ వరకు సమయం పడుతుంది. జనాభా లెక్కల తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కేంద్రం ‘నియోజకవర్గాల పునర్విభజన కమిషన్’ను నియమించాలి. ఈ కమిషన్ రెండు రాష్ట్రాల్లో పర్యటించి, ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, భౌగోళిక సరిహద్దులను నిర్ణయించి, కొత్త నియోజకవర్గాలను ఖరారు చేయడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ లెక్కన చూస్తే, పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సరికి 2029 చివరికి లేదా 2030కి చేరుకుంటుంది. కానీ, సార్వత్రిక ఎన్నికలు 2029 ఏప్రిల్-మే నెలల్లోనే జరగాల్సి ఉంది. అంటే, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కాకముందే ఎన్నికల నగారా మోగనుంది.
ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీట్లు పెరుగుతాయని ఆశించి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కుతుందని ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఇది కోలుకోలేని దెబ్బ. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ఆశావహులు సీట్ల లెక్కల ప్రకారం తమ నియోజకవర్గాలను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పాత సీట్లే కొనసాగితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారికి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. ఇది పార్టీల్లో అసమ్మతికి దారితీసే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా సీట్ల పెంపు హామీ నెరవేరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2029 కూడా దాటిపోతే, కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావడానికి 2034 ఎన్నికల వరకు ఆగాల్సిందే. అంటే విభజన హామీ నెరవేరడానికి ఏకంగా 20 ఏళ్లు పడుతుందన్నమాట. కేవలం సాంకేతిక కారణాలు, జనగణన జాప్యం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు తమకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కోల్పోతుండటం దురదృష్టకరం. పాలనా సౌలభ్యం కోసం జరగాల్సిన ఈ మార్పు, దశాబ్దాల తరబడి వాయిదా పడటం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక లోపంగానే విశ్లేషకులు భావిస్తున్నారు.






