Messi Tour: హైదరాబాద్‌లో మెస్సీ మేనియా.. పర్యటన వివరాలిలా..
హైదరాబాద్: భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇవాళ (శనివారం) హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ‘ద గోట్ టూర్’లో భాగంగా కోల్‌కతా పర్యటన ముగించుకుని వస్తున్న మెస్సీ, సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఈవెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో, నగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది.
రాక: మెస్సీ ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
బస, భేటీ: అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రత మధ్య తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు వెళ్తారు. అక్కడ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
స్టేడియం సందర్శన: రాత్రి 7 గంటలకు మెస్సీ, ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సువారెజ్, అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్‌తో కలిసి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. మెస్సీ సుమారు ఒక గంట పాటు స్టేడియంలో గడుపుతారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి…
ఉప్పల్ స్టేడియంలో బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, వేలాది మంది అభిమానుల మధ్య ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
ఎగ్జిబిషన్ మ్యాచ్: ముందుగా 20 నిమిషాల పాటు చిన్నారులతో కూడిన ‘సింగరేణి ఆర్ఆర్-9’, ‘అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్’ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది.
ప్రత్యేక ప్రదర్శన: ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల ఆటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొంటారు.
అభిమానులతో మెస్సీ: మ్యాచ్ అనంతరం, మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ చిట్కాలు అందిస్తారు. అలాగే, పెనాల్టీ షూటౌట్ విజేతలకు బహుమతులు అందజేస్తారు.
సన్మానం: ఈ కార్యక్రమం చివర్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానించనున్నారు.
మెస్సీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ ప్రధాన పాత్ర పోషించింది. ఫుట్‌బాల్‌పై ఆయనకున్న ఆసక్తి, మెస్సీతో కలిసి ఆడతారన్న వార్తలు ఈ ఈవెంట్‌పై మరింత ఉత్సుకతను పెంచాయి.
రాహుల్ గాంధీ సైతం ప్రత్యక్ష వీక్షణ..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మెస్సీని చూసేందుకు ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనను కలుస్తారు. అనంతరం రాహుల్ గాంధీ తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు వెళ్లి, అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన మేనల్లుడు (ప్రియాంకా గాంధీ కుమారుడు) కూడా వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మెస్సీ ఈ రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి, ఆదివారం తెల్లవారుజామున ముంబయికి బయలుదేరి వెళ్తారు.






