హైదరాబాద్‌లో 70 కోట్ల పెట్టుబడి… అమెరికా కంపెనీ
అమెరికాకు చెందిన సెమీకండర్టకర్ కంపెనీ సెరెమార్ఫిక్ హైదరాబాద్‌లో తన మొదటి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 35 వేల చదవరపు అడుగుల స్థలంలో రూపుదిద్దుకున్న ఈ కేంద్రంలో 150 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్య 400కు పెరుగుతుందని సెరెమార్ఫిక్ వెల్లడిరచింది. ఏటా రూ.70 కోట్లు పెట్టుబడి పెడుతూ హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరిస్తామని, సెమీకండక్టర్ చిప్ అభివృద్ధిపై అధికంగా నిధులు వెచ్చిస్తామని సెరెమార్ఫిక్ సీఈవో వెంకట్ మట్టెల తెలిపారు. తమ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఐఐటీ హైదరాబాద్ నుంచి ఉన్నట్లు, సమీప భవిష్యత్తులో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి మ్యాథ్స్, ఆల్గోరిథమ్ విభాగాల్లో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీఎస్ఎంసీ 5ఎన్ఎం నోడ్ లో అధికంగా ఆధారపడగలిగిన, అధిక ఇంధన సామర్థ్యం గల సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను 2024 నాటికి విపణికి అందిస్తామని పేర్కొన్నారు. సెమీకండక్టర్స్ విభాగంలో ఎంతో నైపుణ్యం ఉన్న సెరిమార్ఫిక్ హైదరాబాద్ నుంచి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడం ముదావహమని, ఇందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.






