Damodar Reddy : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy ) (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital) లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) కేబినెట్‌లో ఆయన ఐటీ శాఖ మంత్రి (IT Minister) గా పనిచేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో దామోదర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో దామోదర్‌రెడ్డి మాటకు చాలా విలువనిచ్చేవారు. అన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఆయనను టైగర్ దామన్న అని పిలిచేవారు. దామోదర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దామోదర్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.