Saraswati Pushkaralu: వైభవంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పన్నెండు రోజుల పాటు ఘనంగా జరిగిన సరస్వతి పుష్కరాలు (Saraswati Pushkaralu) వైభవోపేతంగా ముగిశాయి. పుష్కరాల ముగింపు వేళ సరస్వతి మాతకు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన నవరత్న మాలహరతితో పాటు మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. సరస్వతి పుష్కరాల ప్రత్యేకత, కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని ప్రముఖ అవధాని, మాడుగుల నాగఫణిశర్మ (Madugula Nagaphanisharma) వివరించారు. తొలి నుంచి చివరిరోజు వరకు పవిత్ర త్రివేణి సంగమంలో సుమారు 30 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ (Sailajaramaiyar) వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే సుమారు 2.5 లక్షల మంది పుష్కరాలకు హాజరైనట్లు అంచనా. చివరిజరోజైన సోమవారం సరస్వతి, గోదావరి ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu), సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ తదితరులు పుష్కరాల్లో పాల్గొన్నారు.