CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్‌ల పాత్ర: సీఎం రేవంత్

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రులు నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. హైటెక్ సిటీ నిర్మాణాన్ని మొదట్లో చాలామంది వెక్కిరించారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో వంటి విశ్వనగరాలతో పోటీ పడుతోందని అన్నారు. మన వద్ద అన్ని వనరులు ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం చాలా ముఖ్యమని చెప్పారు. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల్లో తెలుగువారు ఉన్నారని గుర్తు చేసిన ఆయన (CM Revanth Reddy).. రాజీవ్ గాంధీ కృషి వల్లే ఐటీ రంగంలో చాలామంది రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయడం ఆపేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని అన్నారు. తాము హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తుంటే కొంతమంది అడ్డుకుంటున్నారని, వారిని ప్రజలే నిలువరించాలని ఆయన పిలుపునిచ్చారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణాలను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని ఆయన (CM Revanth Reddy) విమర్శించారు.