Target Revanth: డ్యామేజ్ కంట్రోల్..!? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల చేసిన బీహారీ (Bihar) వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్ రాజకీయ నేతలు, ముఖ్యంగా బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచే విమర్శల సెగ తగలడం గమనార్హం. కాంగ్రెస్ యువ నేత కన్హయ్య కుమార్ (Kanhaiah Kumar), రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన్ను మూర్ఖుడు అని అభివర్ణించడం ఈ వివాదాన్ని మరింత రాజుకునేలా చేసింది.
తెలంగాణలో స్థానిక ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి, బీహారీలను ప్రస్తావించారు. “మీరు ఇక్కడ ఈ ఉద్యోగాలు చేస్తే, బీహార్ నుండి వచ్చే వారు ఇక్కడికి రారు” అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను బీహారీలను అవమానించేవిగా ఉన్నాయని, వలస కార్మికులను కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని బీహార్ నేతలు, ప్రజలు భావించారు. మొదట రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) ఈ వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని పీకే ఘాటుగా విమర్శించారు. బీహార్ ప్రజలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి శ్రమను అవమానించడం తగదని అన్నారు.
పీకే విమర్శల తర్వాత ఈ అంశంపై మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ యువ నేత, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కన్హయ్య కుమార్, రేవంత్ రెడ్డి కామెంట్స్ ను తప్పుబట్టారు. ఏ మాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డిని మూర్ఖుడు అని సంబోధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలివి లేదని, ఎవరేంటో తెలియకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేత అయినా సరే, మూర్ఖుడిని మూర్ఖుడనే అంటానని కన్హయ్య కుమార్ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా తెలివి తక్కువని అని ఆయన స్పష్టం చేశారు. బీహార్ ప్రజల కష్టాన్ని, శక్తిని అవమానించే అధికారం ఎవరికీ లేదని, తాను బీహారీగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సొంత పార్టీ ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కన్హయ్య కుమార్ విమర్శల వెనుక బలమైన రాజకీయ కోణం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ యాదృచ్ఛికంగా జరగలేదని, త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం రూపొందించిన గేమ్ ప్లాన్ ఇందులో దాగి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీహార్లోని కోట్ల మంది ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఇవి ఇండియా కూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ బీహారీలకు అండగా ఉందనే సందేశం ఇస్తోంది. బీహార్ రాజకీయాల్లో, ముఖ్యంగా యువతలో కన్హయ్య కుమార్ కు మంచి పట్టు ఉంది. రేవంత్ మాటలను ఖండించడం ద్వారా బీహారీల ఆత్మగౌరవాన్ని కాపాడే నేతగా కన్హయ్య కుమార్ నిలుస్తారు. ఇది పార్టీకి మేలు చేస్తుంది.
మొత్తం మీద, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. సొంత రాష్ట్రంలో స్థానికుల మనోభావాలను సంతృప్తిపరచడానికి చేసిన ప్రయత్నం, దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో పార్టీకి నష్టం కలిగించే పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలో, కన్హయ్య కుమార్ లాంటి నేత బహిరంగంగా విమర్శించడం రేవంత్ రెడ్డిపై మరింత ఒత్తిడి పెంచనుంది. మరి ఈ వివాదంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెబుతారా, లేక ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందనేది ఆసక్తికరంగా మారింది.