Revanth: బీజేపీని టార్గెట్ చేసిన రేవంత్..! ఎందుకు?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jubilee Hills Byelection) ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ (Congress) అభ్యర్థి గెలుపుకోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రచారబరిలో దిగారు. ఆయన బీజేపీని (BJP) టార్గెట్‌గా చేసుకుని తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. అవినీతి కేసులలో బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) నాయకులను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో అవినీతి వ్యవహారంపై విచారణను తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం కిందట సీబీఐకి (CBI) అప్పగిస్తూ లేఖ రాసింది. అయితే ఇంతవరకూ దీనిపై సీబీఐ కేసు నమోదు చేయలేదు. ఇదే అంశంపై బీజేపీని రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని పదేపదే విమర్శించిన బీజేపీ నేతలు, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీబీఐకి అప్పగించాలని మీరే డిమాండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. సీబీఐకి అప్పగించి మూడు నెలలు దాటినా, ఇంకా ఎందుకు టేకప్ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్ రావు ఈ ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినట్లు న్యాయ విచారణలో తేలినా, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా బీజేపీ ఎందుకు వెనుకంజ వేస్తోందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
అంతేకాక, ఫార్ములా ఈ కార్ రేస్ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ఇందులో అవకతవకలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గవర్నర్ ఈ అంశంపై ఇంతవరకూ తుది నిర్ణయం తీసుకోలేదు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్‌ను పంపి రెండు నెలలు దాటినా గవర్నర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని అధికార పార్టీ, గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి కేటీఆర్ ను కాపాడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో కూడిన ఫైళ్లను పంపినా దర్యాప్తు సంస్థలు, గవర్నర్ కార్యాలయం నుండి ఎటువంటి స్పందనా లేదన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి ఇది నిదర్శనమని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం అవినీతిని బీజేపీ నేతలు గతంలో తీవ్రంగా ఆరోపించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడేమో ఆ నాయకులను అరెస్టు చేయకుండా, దర్యాప్తు సంస్థలను కదలకుండా చేసి వారిని రక్షిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు. గతంలో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి అంశాలపై కేసీఆర్ ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడానికి పరోక్షంగా దోహదపడిందని పేర్కొన్నారు. వాళ్లిద్దరిదీ ఫెవిక్విక్ బంధం అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. జూబ్లీహిల్స్‌లో కారు గుర్తుకు ఓటు వేస్తే.. అది బీజేపీకి వేసినట్లేనన్నారు. ఎందుకంటే ఆ కారును నడుపుతున్నది పీఎం మోడీయేనని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.







