Nalgonda: తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్

ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెం (Gandhamvari Gudem) లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి (Srikantachari) నల్గొండ వ్యక్తే. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుంది. నల్గొండలో కృష్ణా జలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు. కేసీఆర్ (kcr) పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండకు ఎక్కువ నష్టం జరిగింది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో నిలిచిపోయన్నారు.
ఈ జిల్లాలో కృష్ణా జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం.వరి పండిస్తే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 8,500 ఐకేపీల ద్వారా రూ.500 బోనస్ ఇచ్చి దాన్యం కొనుగోలు చేస్తున్నాం. 2.70 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను నల్గొండ జిల్లా రైతులు పండించారు. మూడ్రోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు చెల్లిస్తున్నాం. వ్యవసాయం అంటే దండగ కాదు, పండుగ అని నిరూపించాం. కేసీఆర్‌కు ఒక్కటే చెబుతున్నా. గెలిస్తే అధికారం చలాయిస్తాం. ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పండుకుంటామనే విధానం సరికాదు. మే మంతా ఎన్నికల్లో ఓడినా గెలిచినా, ప్రజల్లోనే ఉన్నాం. మా ఎమ్మెల్యేలను లాకున్నా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఏడాది గడుస్తున్నా, ఎప్పుడైనా ప్రతిపక్షనేత పాత్ర పోషించారా? అని ప్రశ్నించారు.