Harish Rao: దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం బాధ్యత వహించాలి : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదని, అవినీతి ఎలా చేయాలో ఈ పాలన చూసి నేర్చుకోవచ్చుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిది (Revanth Reddy) ప్రైవేట్ లిమిటెడ్ పాలన. ఆయన కుటుంబం, మంత్రులది వ్యవస్థీకృత అవినీతి పాలన. దీనికి కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని , హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రజాదర్బార్‌లో ప్రతిరోజు ప్రజలను కలుస్తానని ముఖ్యమంత్రి చెప్పి, ఒక్కరోజుతోనే సరిపెట్టారు. ప్రజాభవన్‌ను సీఎల్పీ సమావేశాలకు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అబద్ధమే. రెండేళ్ల పాలనలో ఎన్నికల హామీలు విస్మరించి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు. కొందరు మంత్రులు (Ministers) బిల్లుల విడుదలకు ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. గుత్తేదారుల బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని పగబట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ, మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అని అన్నారు.
NS GOUD






