హైదరాబాద్ లో మళ్ళీ రియల్టీ జోరు

కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది. వ్యాక్సినేషన్ పెరగడం, ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాల వృద్ధి, అందుబాటు ధరలతో గ్రేటర్‌లో ప్రతి నెలా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో 3,931 యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,340 కోట్లు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే రిజిస్ట్రేషన్ సంఖ్యలో 0.5 శాతం తగ్గాయి కానీ ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే మాత్రం 16 శాతం వృద్ధి రేటు నమోదయింది. గత ఏడాది నగరంలో రూ.25,330 కోట్ల విలువ చేసే 44,278 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. 2020లో 22,570 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ రిజిస్ట్రేషన్లు 2020లో 30 శాతం జరగగా.. గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతానికి క్షీణించిందని చెబుతున్నారు. 2021 డిసెంబర్‌లోని రిజిస్ట్రేషన్లలో 60 శాతం గృహాలు రూ.25`50 లక్షల మధ్య ధర ఉన్నవే జరిగాయి. అన్ని కేటగిరీల్లో లగ్జరీ గృహాల రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 12 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏదీ ఏమైనా మళ్ళీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌రంగం జోరు అందుకున్నదని మాత్రం చెప్పవచ్చు.