Raja Singh: పార్టీలో వేధింపులు ఎదుర్కోలేకపోతున్నా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh).. సొంత పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని, ఇక వీటిని భరించలేని స్థితిలో ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తనతో అవసరం లేదని, వెళ్లిపోమని చెబితే ఇప్పుడే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ చెప్పారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని తను సూచించినట్లు రాజాసింగ్ (BJP MLA Raja Singh) వెల్లడించారు. అయితే, తన సూచనను బీజేపీ నేతలు పక్కన పెట్టి, ఎంఐఎంతో సంబంధాలు ఉన్న వ్యక్తికి పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనకు సరైన సమాధానం కూడా దొరకలేదన్నారు. పార్టీలోని ఒక కీలక నేతకు ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. అసలు ఈ ఎన్నిక విషయమే తనకు తెలియదని సమాధానం వచ్చిందని రాజాసింగ్ తెలిపారు. తాను ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే యుద్ధం చేస్తూ వచ్చానని, ఇప్పుడు సొంత పార్టీతోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన (BJP MLA Raja Singh) ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు దురదృష్టకరమైన పరిస్థితి అని ఆయన అన్నారు.