Revanth Reddy: ఆలస్యం వద్దు.. రేవంత్ కు రాహుల్ అలెర్ట్ సిగ్నల్

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు పడుతోంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటడంతో… మంత్రివర్గ విస్తరణ పై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా… పీసీసీ తో పాటుగా ఏఐసీసీ కూడా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలోనే దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కీలక నేత కేసి వేణుగోపాల్ తో దీనికి సంబంధించి కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేదానిపై స్పష్టత మాత్రం రావటం లేదు.
ఆశవాహుల సంఖ్య దాదాపు 15 వరకు ఉండటంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తారనే దానిపైనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. 2023 ఎన్నికల సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు. మంత్రివర్గంలోకి తీసుకుంటామని అప్పట్లోనే చెప్పడంతో ఆయన కూడా పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా అండదండలు అందించారని చెప్తుంటారు.. ఇక పార్టీలో మరి కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు.
ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నేతలకు గాలం వేస్తున్నాయి అనే ప్రచారం నేపథ్యంలో కాస్త అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులను తీసుకోలేదు. దీనితో ఈసారి ఆ జిల్లాల నుంచి నేతలను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఉంటుందా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత రావటం లేదు.
ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గాధిపత్యం ఎక్కువగా ఉంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో జాగ్రత్త పడే సంకేతాలే కనపడుతున్నాయి. అటు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో ఎమ్మెల్యేలు మరింత కష్టపడి పనిచేసే పార్టీని విజయపథంలో నడిపించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇక వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి సరైన ప్రోత్సాహం అందించాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవుల విషయంలో ఇక ఆలస్యం చేయొద్దని భావిస్తుంది. దసరా నాటికి మంత్రి పదవుల కూర్పు పూర్తి కావాల్సి ఉంది. అలాగే పిసిసి కూర్పు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంది.