Ponnam Prabhakar: నామినేటెడ్ పోస్టుల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా, యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని పీసీసీ మెదక్ జిల్లా ఇంచార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. సోమవారం నాడు గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జిలు, జనరల్ సెక్రటరీలు, అబ్జర్వర్లు హాజరయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలు, మండల అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహులు, జిల్లా కార్యవర్గంలో స్థానం ఆశిస్తున్న వారు, అనుబంధ సంఘాల ఆశావాహులకు మంత్రి పొన్నం (Ponnam Prabhakar) దిశానిర్దేశం చేశారు. “పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన వారికే పదవులు దక్కుతాయి,” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ముందు నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, యాక్టివ్గా ఉన్న వారికే మండల అధ్యక్షుల రేసులో అవకాశాలు వస్తాయని తేల్చిచెప్పారు.






